తెలంగాణలో స్థానిక ఎన్నికలపై హైకోర్టు 4 వారాల స్టే.! బీసీ 42% రిజర్వేషన్ల జీవో 9పై న్యాయ చిక్కులు! లోకల్ ఎలక్షన్లు బంద్!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరో అనూహ్య మలుపు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేచి చూస్తున్న నాయకులకు, ఆశావహులకు గౌరవ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌తో పాటు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన సంచలన జీవో నంబర్ 9 పైనా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎస్ఈసీ నిర్ణయం ఎందుకు? కోర్టు తీర్పు సారాంశం ఏమిటి?
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) రాజ్యాంగబద్ధమైన సంస్థ. న్యాయస్థానాల ఆదేశాలను శిరసావహించాల్సిన బాధ్యత ఎస్ఈసీపై ఉంటుంది. ఈరోజు, ఎన్నికల ప్రక్రియ నిలిపివేతకు ప్రధాన కారణం బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు.
1. జీవో నెం. 9పై స్టే:
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ 9ను జారీ చేసింది. అయితే, ఈ రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ రాజ్యాంగబద్ధమైన ‘ట్రిపుల్ టెస్ట్’ పద్ధతిని లేదా సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తూ కొందరు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం, ప్రాథమికంగా జీవో నంబర్ 9 అమలుపై స్టే విధించింది. అంటే, 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించడానికి వీలులేదని స్పష్టం చేసింది.రిజర్వేషన్ల అంశంపై విచారణను నాలుగువారాలు వాయిదా వేసింది.
2. నోటిఫికేషన్‌కు బ్రేక్:
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జారీ చేసిన జీవో నెంబర్ 9పై స్టే విధించిన వెంటనే, ఆ జీవో ఆధారంగా విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పైనా హైకోర్టు స్టే విధించింది. దీంతో, ఇప్పటికే ప్రారంభమైన ఎన్నికల కోడ్ అమలు, నామినేషన్ల స్వీకరణ వంటి ప్రక్రియలన్నీ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిలిచిపోనున్నాయి. ఎన్నికల ప్రక్రియ చట్టబద్ధతను నిలపడానికి ఎస్ఈసీకి ఇది తప్పనిసరి చర్యగా మారింది.
3. కౌంటర్ దాఖలుకు ఆదేశాలు:
కోర్టు రిజర్వేషన్ల అంశంపై విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. ఈలోగా నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం సమగ్ర సర్వే వివరాలు, రిజర్వేషన్ల కేటాయింపు వెనుక ఉన్న శాస్త్రీయ విధానాన్ని కోర్టు ముందు సమర్పించాల్సి ఉంటుంది.
హైకోర్టులో వాదనలు: ప్రభుత్వం తరఫున వాదన ఏమిటి?
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.
- పిటిషనర్ల వాదనలు: పిటిషనర్లు ప్రధానంగా రిజర్వేషన్ల ప్రక్రియలో చట్టబద్ధమైన లోపాలు ఉన్నాయని, 50 శాతం పరిమితిని పాటించలేదని వాదించారు.
- ప్రభుత్వం తరఫున వాదనలు: ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయం తీసుకుందని, దీనికి అసెంబ్లీలో ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదని గుర్తు చేశారు. అలాగే, సమగ్ర సర్వే చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందని, దీని ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించామని కోర్టుకు వివరించారు. బీసీ రిజర్వేషన్ బిల్లును రెండు సభల్లో పాస్ చేసి గవర్నర్‌కు పంపించామని, అయితే గవర్నర్ బిల్లు పాస్ చేయకుండా అడ్డుకున్నారని కూడా ఏజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సుదీర్ఘ వాదనల అనంతరం, ధర్మాసనం ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది.
మంత్రి వాకిటి శ్రీహరి స్పందన: ‘బీసీల నోటి కాడ కూడు లాగేయడం శోచనీయం’స్థానిక ఎన్నికలకు హైకోర్టు స్టే విధించడంపై రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రంగా స్పందించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ స్టే విధించడం విచారకరమని పేర్కొన్నారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని న్యాయ చిక్కుల్లో పడింది. ఇప్పుడు, ప్రభుత్వం నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేసి, న్యాయస్థానాన్ని సంతృప్తి పరచగలిగితేనే ఎన్నికల ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుంది. రాజకీయ పార్టీల దృష్టి అంతా ఇప్పుడు హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించే కౌంటర్ పైనే ఉంది.